కమెడియన్ వేణు తెరకెక్కించిన చిత్రం బలగం థియేటర్లలో విజయవంతంగా ఆడుతోంది. ఈ చిత్ర బృందానికి మెగాస్టార్ చిరంజీవి అభినందనలు తెలిపారు. దర్శకుడు వేణును చిరంజీవి శాలువాతో సత్కరించారు. ఈ సినిమా చూస్తున్నంత సేపు చిన్నప్పటి నుంచి జరిగివన్ని కళ్ల ముందు కనిపించాయని మెగాస్టార్ అన్నారు. ఈ చిత్రంలో ప్రియదర్శి లీడ్ రోల్ గా నటించారు. బిమ్స్ సంగీతాన్ని అందించారు. తెలంగాణ యాసలో వచ్చిన ఈ సినిమా బాగున్నట్లు పబ్లిక్ చెబుతున్నారు. చాలా మంది ఈ చిత్రానికి పాజిటివ్ రేటింగ్ ఇచ్చారు.
హీరో సాయిలు తాత కొమురయ్య చావు నుంచి దినాల వరకు, పిట్ట ముట్టకపోవడం చుట్టూ తిరిగిన ఈ కథ.. ప్రతీ ఒక్కరి కళ్లలో నుంచి కన్నీళ్లు తెప్పిస్తోంది. తెలంగాణ కుటుంబ నేపథ్యాన్ని, పల్లె జీవితాన్ని ఆవిష్కరించిన సినిమా ఇది. కొమురయ్య కోరిక తీరకపోవడంతోనే పిట్ట ముట్టలేదనే నమ్మకం. అన్నాదమ్ములు, చెల్లె, ఆమె భర్త... ఇతర కుటుంబ సభ్యుల మధ్యన ఉన్న చిన్న చిన్న మనస్పర్థలు. వారి గొడవల గురించి మాట్లాడటానికి చుట్టుపక్కల వాళ్లు, పెద్ద మనుషులు. మరోవైపు పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయి..
వాటిని తనకు వచ్చే కట్నంతో తీర్చాలనుకునే హీరో. దినాల రోజు పిట్ట ముట్టకపోతే గ్రామం నుంచి వెలివేస్తామని పెద్ద మనుషులు తీర్మానించడం. చివర్లో వచ్చే పాట ఆ కుటుంబంలోని వ్యక్తులకు తమ జ్ఞాపకాలు, బాధ్యతలను గుర్తుచేస్తూ సాగుతుండగా.. అందరూ కలిసి ఉండటమే తాత కోరికని ఆయన సంచిలోని ఫొటోనూ హీరో తీసుకు రావడం.. ఒకరినొకరు హత్తుకొని అందరూ ఏకమై, గతాన్ని గుర్తుకు చేసుకొని ఏడ్వటం.. అందరూ కలిసి కొమురయ్యకు దండం పెట్టడం.. చివరగా పిట్ట ముట్టడంతో సినిమా ముగుస్తోంది.
ఈ సినిమా కాసేపు నవ్వించింది, కాసేపు ఏడ్పించింది. సినిమా చూసిన ప్రతి ఒక్కరూ తీవ్రమైన భావోద్వేగాలకు లోనువుతారనడంలో ఏమాత్రం సందేహం లేదు. కుదిరితే మన వాళ్లు కూడా ఇలా కలిసుంటే బాగుండు అనిపిస్తుంది. తెలంగాణలోని ప్రతీ ఒక్కరూ తమ కుటుంబ సభ్యులతో కలిసి చూడమని చెప్పేలా ఈ సినిమా ఉంది. అయినవారందర్నీ దూరం చేసుకొని కోట్లు సంపాదించినా దండగే అనే సందేశాన్ని ఇచ్చింది. అన్నకు ఎంత విలువ ఇవ్వాలో.. తమ్ముడిని ఎలా చూసుకోవాలో.. ముఖ్యంగా ఆడ బిడ్డకు ఎంత ప్రాధాన్యత ఇవ్వాలో.. బావ ఎంత ముఖ్యమో.. ఈ సినిమా గుర్తు చేసింది.
ఎప్పుడూ తన కామెడీతో నవ్వించిన వేణు అన్నా.. తన దర్శకత్వ ప్రతిభతో ఇంతలా ఏడిపిస్తాడని ఊహించలేదు. కాసర్ల శ్యామ్ పాటలు, భీమ్స్ సంగీతం ఈ సినిమాకు అతిపెద్ద బలం. ఈ సినిమాలో నాకున్న ఏకైక అభ్యంతరం మేనత్త బిడ్డను హీరో పెళ్లి చేసుకునేందుకు సిద్దమవ్వడం. తెలంగాణలో మేనత్త బిడ్డలను పెళ్లి చేసుకునే సంప్రదాయం అయితే నాకు తెలిసి లేదు. వాళ్లను కూడా మనం కాళ్లు మొక్కుతాం. మన ఆడ బిడ్డాల్లానే చూస్తాం! ఈ ఒక్కటి మినహా సినిమా ప్రతీ ఒక్కరూ చూడాల్సిందే.


కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి