ఆ రాత్రి పార్టీ ముగిశాక అర్థరాత్రి కావస్తుండగా ఒంటరిగా నేనుండే నా గదికి చేరుకున్నా. డ్రెస్ మార్చుకుని, రిఫ్రెష్ అయి నిద్రపోదామని మంచం మీద కూర్చున్నా. నడుం వాల్చడానికి శరీరం సాహసించలేదు. ఏదో జరుగుతోంది. ఎడమ భుజం నుంచి జివ్వున నరాల్ని ఎవరో లాగినట్లు నొప్పి. క్షణాల్లో మెడ మీద నుంచి కుడి భుజాన్ని కూడా కుదేలు చేస్తోంది. ఎందుకిలా? రెండు పెగ్గుల వైన్ తాగడం కొత్తేమీ కాదుగా? ఆయాసమా? గ్యాస్ సమస్యతో ఛాతీ ఉబ్బరిస్తోందా? లేదు లేదు వీపు పైభాగంలో కూడా ఏదో తెలియని నొప్పి. ఇంతకు ముందెప్పుడూ తెలియని నొప్పి. కాసేపు అలానే తలవంచి ఛాతీని చూసుకుంటూ కూర్చుని, మరి కాసేపు లేచి గదిలోనూ అటూ ఇటూ పచార్లు చేసి, గుక్కెడు మంచి నీళ్ళు తాగి కుదుటపడదామని ఆశపడ్డాను కానీ, వీలు కాలేదు.
అప్పటికి వారం రోజుల ముందే నా ఫేస్బుక్ వాల్ మీద ‘These pains you feel are messengers. Listen to them’ అని జలాలుద్దీన్ రూమీ రాసిన వాక్యాల్ని పోస్ట్ చేశాను. అది ఈ context లో ఒంటి మీద చర్నాకోలాలా తగిలింది. దాదాపు ఒంటిగంట అవుతుండగా గది నుంచి బయటకు వచ్చి మా ఆఫీస్ వారికి క్యాబ్ సేవలు అందించే వ్యక్తికి ఫోన్ చేశాను. కారు రావడానికి ఓ పది నిమిషాలు పడుతుంది. ఇక లాభం లేదు. భుజాలు శరీరంతో సంబంధం లేనట్లుగా పైకి లాక్కుపోతున్నాయి. పావుగంట నడక దూరంలో ఉన్న మిత్రుడు, కొలీగ్ ఇంటికి వెళ్లాను. కాలింగ్ బెల్ కొట్టాను. తలుపు బాదాను. తను లేవలేదు. నాకు ఓపిక లేదు. రెండో ఫ్లోర్ మెట్ల మీద కూర్చున్నా.
పాపం అతను కూడా పార్టీ నుంచి అప్పుడే వచ్చి గాఢనిద్రలోకి వెళ్లిపోయాడు. ఇంతలో తలుపు తెరుచుకుంది. ప్రాణం లేచి వచ్చింది. పదండి ఆస్పత్రికి వెళదాం అన్నాను. పరిస్థితి అర్థమైంది. క్షణాల్లో నన్ను తీసుకుని బయలుదేరాడు. గేటు వద్దకు ఇంకా క్యాబ్ రాలేదు. యుగాల్లాంటి నాలుగు నిమిషాల తరువాత ఫ్లడ్ లైట్ ధూమాన్ని వెదజల్లుతూ కారొచ్చింది. పావుగంటలో దగ్గరలో ఉన్న ధర్మశిల నారాయణ సూపర్ స్పేషాలిటీస్ ఆస్పత్రికి వెళ్లాం. ఎమర్జెన్సీ పడక మీద టెస్ట్ చేస్తే ఈసీజీ నార్మల్. బీపీ కాస్త పెరిగింది. గత వారం కూడా డౌటొచ్చి ఈసీజీ చేయించుకుంటే బాగానే ఉందన్నాడు డాక్టర్. ఈలోగా నా పరిస్థితి చూసి డ్యూటీ డాక్టర్ బ్లడ్ టెస్ట్ చేయించాలన్నారు.
Troponin I మామూలుగా 12 దాటకూడదు. గుండె కండరాలు దెబ్బతిన్నప్పుడు రక్తంలోకి ఈ ప్రొటీన్ విడుదలవుతుంది. అది నాకు అత్యంత దారుణంగా 189.3 PH రేంజికి పెరిగింది. Death is a Process, rather than event అన్నట్లు సడీ చప్పుడు లేకుండా నాలోపల ఇంత జరిగిపోయిందా? Heart attack కుట్ర చివరి అంకం దాకా అమలైపోయిందా? తెల్లారేదాకా శరీరం యధాతథ స్థితిలో ఉండేలా ఏవో ఏర్పాట్లు చేశారు డాక్టర్లు. పొద్దున ఆరు గంటలకు మళ్లీ ఈసీజీ తీస్తే అప్పుడు వచ్చింది borderline రిజల్ట్. ఈకోలో అంతా నార్మల్. తొమ్మిది గంటలకు ఈ టెస్టులు రిపీట్ చేశారు. అప్పుడు కానీ ఈసీజీ తేల్చలేదు నా హృదయ స్పందన abnormal అని. ఏం మాయ చేసావే ఈసీజీ? చావు ముంచుకొచ్చేదాకా గుట్టు విప్పవా?
మార్చి 6: దాదాపు 10 గంటలకు ఆంజియోగ్రామ్ మొదలైంది. అరగంటలో అంతా స్పష్టం. గుండెలో కుడివైపు ఉండే ధమని Right coronary artery (RCA) 95% బ్లాక్ అయిపోయింది. Left anterior descending (LAD) 80 శాతానికి పైగా మూసుకుపోయింది. Left circumflex artery (LCX) పరిస్థితి కొంత నయం. అది 30 శాతం తెరుచుకునే ఉంది. ఇదీ నా గుండెలోని మూడు ముఖ్యమైన ధమనుల అధ్వాన స్థితి. ముంజేతి నరంలోంచి బయలుదేరిన చీమ కన్నొకటి గుండెలొకి చొరబడి ఈ నిష్ఠుర నిజాన్ని కుండబద్ధలు కొట్టింది. టాప్ స్కోరర్ RCAలోకి మరో అరగంటలో Xience Alpine అనే Stent బెలూన్‌తో పాటుగా చొరబడి విచ్చుకుంది. ఎనభై శాతం దెబ్బ తిన్న LAD సంగతి రెండు వారాల తరువాత చూద్దామన్నారు డాక్టర్ ప్రదీప్ కుమార్ నాయక్, MD DNB Cardiology, నెమ్మదించిన నా భుజాల మీద నమ్మకంగా చేయి వేస్తూ.
జర్నలిస్టుగా ఇలాంటి సమస్యల గురించి వార్తలు రాసి, సరి చూసి, ఇటీవల రాలిపోయిన వారి కథనాలను అందిస్తూ సహానుభూతితో గుండె బరువెక్కిన ఈ రోజుల్లో ఇది స్వానభవంగా మారడమే విచిత్రం. సానుభూతి కోసం స్వానుభవాల్ని తలపోయడం ససేమిరా గిట్టని నాకు ఇదంతా ఎందుకు రాయాలనిపించింది? వయసుతో నిమిత్తం లేకుండా ఈ మధ్య చాలా మందికి అనుభవాలు ఎదురవుతున్నాయి. కొన్ని అనుభవాలు విషాదాంతం అవుతున్నాయి. అందుకే, కొందరినైనా అప్రమత్తం చేస్తాయనే ఆశతోనే అని నాకు తెలిసిన సీనియర్ జర్నలిస్ట్ అనుభవాన్ని పంచుకున్నారు.

కామెంట్లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి