ఆ మాట వినగానే.. రాజమ్మ చేతిలోని పళ్లెం చేయి జారింది. ఖన్నుమని శబ్దం వచ్చింది. గతకాలపు ఘట్టాలన్నీ ఆమె కళ్ల ముందు ఒక్కసారిగా కదలాడాయి.
రాజమ్మకు పదహారేళ్లప్పుడు పెళ్లి చేశారు. పెళ్లి అయిన రెండేళ్లకు గర్భం దాల్చింది. కొడుకు పుట్టిన ఏడాదికే పాము కాటుకు భర్త బలయ్యాడు. అత్తమామలకు భారమవ్వగా తిరిగి పుట్టింటికి చేరుకుంది రాజమ్మ. ఎవరో ఉండి, "పోయినోడు ఎలాగూ పోయాడు. ఈ చంటోడిని ఎవరికన్నా ఇచ్చేసి, మళ్లీ పెళ్లి చేద్దాం. ఎన్నాళ్లీ సంత?'' అన్నారు. గుడ్లురిమి చూసింది రాజమ్మ.
ఉన్న ఊర్లోనే వేరుగా బతికింది. ఒంటరి ఆడదానికి ఎన్నెన్ని తిప్పలు ఎదురవుతాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు కదా! అన్నింటినీ తిప్పి కొట్టింది. కూలీకి పోయింది. కొడుకే సర్వస్వం అనుకుని బతికింది. ఉన్నంతలో ఏ లోటు రానివ్వకుండా పెంచింది.
కాలం ప్రవాహంలో ఏళ్లు గడిచాయి..
ఆ కొడుకుకు చదువుకు తగ్గ ఉద్యోగం వచ్చింది. ఓ పెద్దింటి పిల్లను ప్రేమించి పెళ్లి చేసుకొచ్చాడు. కాపురాన్ని కొత్తింటికి మార్చాడు. ఈరోజు.. కోడలి పుట్టింట్లో ఏదో ఫంక్షన్. 'నేనూ వస్తానురా' అంది రాజమ్మ. తీసుకు వెళ్లడానికి ఏ మాత్రం ఇష్టం లేకపోయినా, వద్దని చెప్పడానికి ధైర్యం చాలక ఆమెనూ అక్కడకు తీసుకెళ్లాడు ఆ కొడుకు.
రాజమ్మ మట్టిలో పుట్టి, మట్టిలో పెరిగిన మనిషాయే. ఆ మేకప్ సొగసుల మధ్య ఇమడలేకపోయింది.భోజనాల దగ్గర అవస్థలు పడుతోంటే పళ్లెం తీసుకుని కసురుకుంటూనే అన్నం పెట్టిచ్చాడు ఆ కొడుకు. ఇది గమనించిన ఓ డబ్బున్న పెద్ద మనిషి.. అతని వద్దకు వచ్చి"హాయ్ మిస్టర్ వినోద్.. ఎవరు ఆమె?" అని అడిగాడు. ఏం చెప్పాలో అర్థం కాక, నీళ్లు నమిలి, "ఆమె మా ఇంట్లో పని మనిషి" అని సమాధానమిచ్చాడు.కొడుకు నోట ఆ మాట వినగానే.. రాజమ్మ చేతిలో నుంచి పళ్లెం చేయి జారింది. ఖన్నుమని శబ్దం వచ్చింది.
' ఏంటమ్మా బుద్ధి ఉండక్కర్లా' అని ఆ మెతుకులు.. మీద పడ్డ వారెవరో కసరుకున్నారు. తేరుకున్న రాజమ్మ, తప్పయిందని చెప్పింది. కిందపడ్డ అన్నాన్ని చేతులతో ఎత్తింది.ఇంకా ఇక అక్కడే ఉంటే బాగోదని మెల్లిగా జారుకున్నాడు ఆమె కొడుకు వినోద్. 'హమ్మయ్య గండం గట్టెక్కింది. పరువు దక్కింది' అని పక్కకొచ్చి సంబరపడ్డాడు. ఆ తర్వాతి రోజు ఇంటికి చేరుకున్న రాజమ్మ.. 'ఎందుకో.. ఉరేసుకుని చచ్చిపోయిందట' అనే వార్త ఆ ఊర్లో వారందరికీ తెలిసింది.
--Pavan kumar

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి